శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గోరంట్ల మాధవ స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కర్నూలు జిల్లా కోడుమూరు మండలము గోరంట్ల గ్రామములో కలదు.
కర్నూలు పట్టణము నుండి సుమారు ౩౦ కిలో మీటర్ల దూరములో ఉన్నది కర్నూలు బస్టాండ్ నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు కలదు .
చోళుల
కాలం నాటికే ప్రసిద్ధి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గోరంట్ల మాధవాలయమునకు దాదాపు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.
చోళ (క్రీ .శ. 1105 ) , యాదవ (క్రీ .శ.1210 -46 /47), ఆరవీటి (క్రీ .శ. 1628 ) రాజుల శిలాశాసనములు ఇక్కడ లభిస్తున్నాయి .
ఈ శిలాశాశనాల సర్వే 1937-38 వ సంవత్సరములో మద్రాసు ప్రభుత్వం వారు జరిపించారు .
గోరంట్ల మాధవ స్వామికి సంభందించిన తామ్ర శాసనములు మద్రాసు ప్రభుత్వం వారికి చేరినట్లు వినికిడి , మెకంజీ కైఫీయతుల్లో గోరంట్ల గురించి వ్రాయబడినది .
మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంధములలో గోరంట్ల మాధవ స్వామి కి సంభందించిన మాధవ శతకం , మాధవాష్టకం తాటాకు పుస్తకాలలో జీవిస్తున్నాయి . దాదాపు శతాబ్దం నాటి వారగు లక్ష్మీపురం యల్లకవి , బొబ్బిలి వెంకటరమణ మూర్తి గోరంట్ల మాధవుని గురించి రచించిన అముద్రిత రచనలు నేడు అలభ్యముగా వున్నవి .
గోరంట్ల గ్రామము అర్చక కుటుంబం లో జన్మించిన కీ.శే. బాలకవి వేంకటరమణాచార్యులు గారు శ్రీ మాధవుని కీర్తిస్తూ వేలాది పద్యాలు రచించారు. అందులకొన్ని శ్రీ మాధవగాధా సుధాలహరి పేరున త్వరలో అచ్చుకు సిద్ధమౌతున్నది.